TELANGANA

తెలంగాణలో పెన్షన్ రూ 4 వేలకు పెంపు హామీ – ప్రభుత్వం తాజా నిర్ణయం..!

తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ 4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో కొత్త పింఛన్‌ డబ్బులు ఇస్తారని లబ్ది దారులు ఆశించారు. కానీ, ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెల కూడా పాత ఫించన్లే అందనున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పినా ఇందుకు సంబంధించి సర్కార్‌ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు ఈ నెల కూడా పాత పద్ధతిలోనే పింఛన్లు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు.

 

అమలు ఎప్పుడు :ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తం రూ 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేసిన హామీల్లో సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో, జనవరి లో ఇవ్వటం సాధ్యపడలేదు. ఫిబ్రవరిలో పెరిగిన పెన్షన్ అందుతుందని లబ్దిదారులు ఆశించారు. కానీ, పాత తరహాలోనే పింఛన్లను ఇస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ల సొమ్ము జమ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ నెల పాత పెన్షనే:అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లోగా అమలు చేస్తామని తాము హామీ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, పెన్షన్ విషయంలో పలువురు నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన అంశాన్ని లబ్దిదారులు గుర్తు చేస్తున్నారు. మార్చి 15వ తేదీకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి కానుంది. పథకాల అమల్లో భాగంగా ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దర ఖాస్తులు స్వీకరించారు. మొత్తం పథకాలు అన్నీ ఒకేసారి అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. కొత్త పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఎన్నింటికి ఆమోదం లభిస్తుందో చూడాలి.

 

విద్యుత్ బిల్లుల పై సందిగ్ధత:ఇక, విద్యుత్ బిల్లుల చెల్లింపు పైనా సందిగ్ధత కొనసాగుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అయితే, తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ జనవరి కరెంట్ బిల్లులు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు విద్యుత్ బిల్లులు తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెల్లించవద్దంటూ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఇప్పుడు ఈ నెల బిల్లులు చెల్లింపు పైన వినియోగదారుల్లో సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వం బిల్లుల చెల్లింపు పైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం ఉచిత విద్యుత్ పైన తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని, బిల్లులు చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.