TELANGANA

పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ..

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అందుకే ఆయన బీఆర్ఎస్ నల్గొండ లోక్ సభ సన్నాహాక సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. అయితే పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లైతే తన కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఎందుకు అడుగుతాను అని గుత్తా ప్రశ్నించారు. కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.

 

అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తానే కారణమైతే ఖమ్మం, మహబూబ్ నగర్ , వరంగల్ జిల్లాలో ఓటమికి ఎవరు కారణమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వచ్చిందని.. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. అభివృద్ధి చేసిన మంత్రులు కూడా ఓడిపోయినట్లు గుత్తా చెప్పారు. ఖమ్మం, మహబూబ్ నగర్ ఎంపీ సీట్లతో పాటు నల్గొండ సీటు విషయంలో కూడా పోటీ ఉన్నట్లు గుత్తా పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అవకాశం ఇస్తే తన కొడుకు అమిత్ భువనగిరి లేదా నల్గొండ సీటు నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని చెప్పారు. దీనిపై మరో మూడు నాలుగు రోజుల తర్వాత అధిష్టానం క్లారిటీ వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. కేఆర్ఎంబీ కేంద్రం పరిధిలోకి వెళ్తే తెలంగాణకు నష్టమేనని అన్నారు. సాగు, తాగు నీళ్లకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్ లు కేఆర్ఎంబీ పరిధిలోకి పోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

 

మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా ఎంపీ స్థానంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గుత్తా పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ గుత్తా ఇంటికి వెళ్లడం చర్ఛనీయంశంగా మారింది.