TELANGANA

ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తాజాగా, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉచిత్ విద్యుత్ పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.

 

కోమటిరెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కమిటీ చర్చించింది. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు.

 

వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పులపాలైందని.. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇది ఇలావుండగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి 30 మంది ఎమ్మెల్యేలు వస్తారని కోమటిరెడ్డి సోమవారం నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.

 

యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతోపాటు ఛత్తీస్‌గఢ్ లో కరెంటు కొనుగోళ్లతో అవినీతి పడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్ సిట్టింగ్ జడ్జి విచారణ అనంతరం కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది ఆయనేనని అన్నారు