AP

మంత్రి రోజా సీటు గల్లంతేనట…?

మంత్రి ఆర్కే రోజా… ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని, జగన్ ఎలాగైనా తనకు టికెట్ కేటాయిస్తారని బలమైన విశ్వాసంతో ఉన్నారు. కానీ ఈసారి రోజాకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మంత్రి రోజాను తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగరి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న రోజాకు ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ టికెట్టు దొరకదని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.

 

అయితే వైసిపి హై కమాండ్ త్వరలో ఐదవ జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో రోజా తో పాటు పలువురు నేతలలో టికెట్ పై టెన్షన్ కొనసాగుతుంది. రోజాకు నగరి నుంచి టికెట్ కేటాయించకున్నా మరొక స్థానం నుంచి అయినా టికెట్ ఇస్తారా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. అయితే ఆమెకు అసలే టికెట్ ఇవ్వరని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.

 

అయితే రోజాకు టికెట్ కేటాయించకపోవడం వెనుక ఇద్దరు మంత్రులు ఉన్నారని చర్చ జరుగుతుంది. నగరిలో రోజా పనితీరుపై ఉన్న అసంతృప్తి, నియోజకవర్గం లో సొంత క్యాడర్ నుంచి వినిపిస్తున్న వ్యతిరేక గళం, నగరిలో గ్రూప్ రాజకీయాలు, రోజాపై, ఆమె సోదరుడి పై ఉన్న అవినీతి ఆరోపణలు వెరసి ఆమెకు టికెట్ రాదని తెలుస్తుంది.

 

తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజా టిడిపిలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. 2004లో టిడిపి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రోజా 2009లోనూ టికెట్ ఆశించారు. అయితే టిడిపి 2009లో రోజాకు టికెట్ ఇవ్వకపోవడంతో టిడిపికి గుడ్ బై చెప్పిన రోజా 2014 ఎన్నికలలో వైసిపి నుండి పోటీ చేసి విజయం సాధించారు.

 

దీంతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినప్పటికీ వైసిపి అధికారంలో లేకపోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఉండిపోవలసి వచ్చింది. ఆపై 2019లో మళ్లీ నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన రోజా మరోమారు విజయం సాధించారు. జగన్ తొలి మంత్రివర్గంలో రోజాకు స్థానం దక్కలేదు కానీ రెండవసారి మంత్రివర్గ విస్తరణలో రోజాకు టూరిజం శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడంతో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న రోజా వైసీపీ నుండి నగరి టికెట్ ఆశిస్తున్నారు.

 

అయితే రోజా కి వ్యతిరేకంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు గళం వినిపిస్తున్నారు. అంతే కాదు రోజా సోదరుడు కుమారస్వామి తమ వద్ద పదవి ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారంటూ బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. రోజాకు సీటు ఇవ్వద్దని అక్కడ జరుగుతున్న రచ్చ నేపథ్యంలో రోజా సీటు గల్లంతవుతుందని టాక్ వినిపిస్తుంది.