TELANGANA

మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ నివేదికలో సంచలన విషయాలు..

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో 16 నుంచి 21వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. అంతేగాక, 6,7,8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో వెల్లడించింది.

 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదని, కటాఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్‌ పేర్కొంది. త్రీడీ నమూనా ప్రకారం అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారం సరి చేయలేదని తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదని పేర్కొంది. మరమ్మత్తుల కోసం నాలుగుసార్లు (2020 మే, 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్) నోటీసులు ఇచ్చారని.. అయినప్పటికీ దెబ్బతిన్న భాగానికి నీటిపారుదలశాఖ, ఏజెన్సీ మరమ్మతులు చేపట్టలేదని స్పష్టం చేసింది.

 

 

బ్యారేజీ ఆపరేషన్‌లోకి తీసుకొచ్చే ముందు తనిఖీ చేయలేదని, సీసీ బ్లాకులను ప్రాజెక్టు అథారిటీస్ కనీసం తనిఖీ కూడా చేయలేదని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. 2019 నవంబర్‌లోనే ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని, 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం నుంచి మెయింటెనెన్స్‌ లేదని నివేదికలో వెల్లడించింది.

 

రాఫ్ట్, సీకెంట్ పైల్స్ నిర్ధిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదని, ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం గుత్తేదారు పనులు పూర్తి చేయలేదని కమిటీ పేర్కొంది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌కు సంబంధించి రామగుండం ఈఎన్సీ ఇచ్చిన నివేదికను ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. మేడిగడ్డ వైఫల్యంపై పూర్తి నిర్ధరణ కోసం నిపుణుల కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్‌ కమిటీ సూచించింది.