సీఎం జగన్ , టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల యుద్దంలో కార్యకర్తలు చొక్కాలు మడత పెట్టాలని జగన్ పిలుపునిస్తే…టీడీపీ – జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతబెడతారని చంద్రబాబు హెచ్చరించారు. ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైపోయిందని విమర్శించారు. జగన్ పాలన పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ఎన్నికల వేళ సీఎం జగన్ – చంద్రబాబు మధ్య సవాళ్ల పర్వం కొనసగుతోంది. తాజాగా వాలంటీర్ల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పైన చంద్రబాబు స్పందించారు. రాబోయే ఎన్నికలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు చొక్కాలు మడతపెట్టే సమయం వచ్చిందని సీఎం జగన్ అంటున్నారని..వాళ్లు చొక్కాలు మడతపెడితే.. టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు కుర్చీలు మడతపెడతారు.
అందరం కుర్చీలు మడతపెడితే జగన్‌రెడ్డికి కుర్చీ లేకుండా పోతుందని హెచ్చరించారు. ఎన్నికలంటే చొక్కాలు, కుర్చీలు మడతపెట్టి కొట్టుకోవడం కాదని, ద్వంద్వయుద్ధమని హితవు పలికారు. ఈ ప్రభుత్వంలో అందరూ బాధితులేనని వివరించారు. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ దెబ్బతింటే.. దానిని మళ్లీ సంపాదించుకోవడం చాలా కష్టమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చెడును నివారించడానికి ప్రజలందరూ నడుం బిగించాలన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా చైతన్యవంతం కావాలని సూచించారు. ఈ ప్రభుత్వంపై తిరగబడతారా.. బానిసలుగా ఉండిపోతారా అనేది ప్రజలే తేల్చుకోవాలని పేర్కొన్నారు. ఇక 54 రోజులే సమయం ఉందన్నారు.
జగన్ లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ధ్వసం చేసి.. గత ఐదేళ్లుగా మూడు రాజధానులన్నారు. ఇప్పుడు నాలుగో రాజధాని (హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా) అంటున్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్రాన్ని, 5కోట్ల ప్రజల సంకల్పాన్ని కాపాడాలనే గట్టిసంక్పలంతో నేను, పవన్ ముందుకెళ్తున్నామని చంద్రబాబు వివరించారు.