AP

అమిత్ షా – చంద్రబాబు భేటీ అందుకే తేల్చేసిన పురందేశ్వరి..!!

ఏపీలో ఎన్నికల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత వారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. దీంతో, టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ, రెండు పార్టీల నుంచి పొత్తుల పైన అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల పైన వేచి చూసే ధోరణిపైన టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో అసలు అమిత్ షా తో చంద్రబాబు ఎందుకు భేటీ అయ్యారో పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు.

 

చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత పార్టీ నేతలతో పొత్తుల పైన చర్చించారు. బీజేపీతో పొత్తు పైన సంకేతాలు ఇచ్చారు. జగన్ ను ఓడించాలంటే పొత్తులు తప్పవని చెబుతూ వచ్చారు. బీజేపీ తమ రెండు పార్టీలతో కలిసి రావాలని కొంత కాలంగా చంద్రబాబు, పవన్ కోరుతూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ నుంచి స్పందన వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలోనూ అమిత్ షా ఏపీలో పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ లో పొత్తుల పైన త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు. సీట్ల ప్రకటన చేసేందుకు సిద్దమైన చంద్రబాబు, పవన్ బీజేపీ తో చర్చలతో నిర్ణయం వాయిదా వేసుకున్నారు. కానీ, ఇప్పటికీ బీజేపీ నుంచి పొత్తు పైన ఎలాంటి స్పష్టత రాలేదు. అమిత్ షా తో చంద్రబాబు భేటీ తరువాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

 

వరుసగా చంద్రబాబు, సీఎం జగన్ తో బీజేపీ అగ్రనాయకత్వం సమావేశం కావటంతో ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. పొత్తుల అంశం పైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశం కావడంపై రాద్ధాంతం అవసరం లేదన్నారు. సీఎం హోదాలో జగన్‌, రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిశారని, రాష్ట్రం గురించి చర్చించారని చెప్పుకొచ్చారు. వైసీపీతో బీజేపీ కుమ్మక్కైందనే ప్రచారంలో పస లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో తమ పార్టీ పోరాడుతోందని గుర్తుచేశారు. పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తామని పురంధేశ్వరి స్పష్టం చేసారు. ఈ నెల 17, 18 తేదీల్లో బీజేపీ జాతీయ ముఖ్య నేతల సమావేశాల సమయంలో పొత్తు పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.