AP

చంద్రబాబుకు బిగ్ షాక్.. జగన్‌తో భేటీ అయిన టీడీపీ నేత..

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని వంటి టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరారు. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు.

 

మాజీ ఎమ్మెల్యే, నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన వైసీపీ అధినేత జగన్‌ను సీఎం క్యాంపు కార్యలయంలో కలిశారు. దీంతో ముద్దరబోయిన టీడీపీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖారారైంది. ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముద్దరబోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు.తనకు టీడీపీ అధినేత చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వాపోరాయన.

 

ఈ ఘటన జరిగి సరిగ్గా 24 గంటలు గడవక ముందే ఆయన సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కారణంగానే ముద్దరబోయిన టీడీపీని వీడారు. నూజివీడు టికెట్‌ కొలుసు పార్థసారథికి కేటాయించడంతో మనస్తాపం చెందిన ముద్దరబోయిన టీడీపీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.

 

గత 10 ఏళ్లుగా తాను నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డానని, కోట్లు ఖర్చు చేశానని తీరా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే సరికి తనని కాదని వేరే వ్యక్తికి ఎలా టికెట్ కేటాయిస్తారంటూ బహిరంగంగానే చంద్రబాబును ముద్దరబోయిన ప్రశ్నించారు. నూజివీడు టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే ముద్దరబోయిన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ఆయన సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు.

 

గతంలో గన్నవరం ఎమ్మెల్యేగా పని చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు…2014,2019 ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండు పర్యయాలు కూడా వైసీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు చేతిలో ముద్దరబోయిన ఓటమి చవి చూశారు. ముద్దరబోయిన టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఆయన్ను ఎక్కడ నుంచి బరిలోకి దింపుతారో అనే ఆసక్తి నెలకొంది.