తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కారు మరో ముందుడు వేసింది. గృహజ్యోతి(200 యూనిట్వ వరకు ఉచిత విద్యుత్), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఫిబ్రవరి 27 లేదా 29న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్సబ్కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా, ఏజెన్సీలకు చెల్లించాలా? అనే విషయంపై చర్చించారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. మరో విధానంలో లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూసేలా ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు.
తెల్లరేషన్‌కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ గృహజ్యోతి పథకం(Gruhajyothi Scheme) వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తుల్లో కార్డునెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునే అవకాశమివ్వాలని స్పష్టం చేశారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని పేర్కొన్నారు.
ప్రజా పాలన(Praja palana)లో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.