TELANGANA

ధరణిపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు- సమగ్ర విచారణకు ఆదేశాలు ..

ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి మొదటి వారంలోనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావాలని చెప్పారు.

 

ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో 2.45 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

 

 

దీనికి- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వొకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బీ మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.

 

2020లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన ఆర్‌ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల రెన్యూవల్స్‌లో కొత్త చిక్కులు వచ్చాయని, ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు.

 

సుమారు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకోవడానికి రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, ఏ మాడ్యుల్‌లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఈ కమిటీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చింది.

 

ఫలితంగా- లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవడానికి 1,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని వివరించింది.

 

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని, లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటాను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ దగ్గర ఉంచటాన్ని ముఖ్యమంత్రి తప్పు బట్టారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. 2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్‌ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్మెంట్‌ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు.