AP

వైసీపీ సర్కార్‌పై ఘాటు విమర్శలు, దివాలా తీసిందంటూ..?

జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దివాళా తీసిందని ఆరోపించారు. ప్రతీనెలా ఆర్‌బీఐ, కేంద్రం నుంచి రుణాలు తీసుకోకపోతే రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి లేదన్నారు.

 

రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడిందన్ననారు కిరణ్ కుమార్‌రెడ్డి. శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కలికిరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించిన ఆయన, తర్వాత మీడియాతో మాట్లాడారు. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం అవినీతిని రూపుమాపడమేనన్నారు. వైసీపీ నాయకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారని ఆరోపించారు. దోచుకున్న నగదును కొంచెం ప్రజలకు పంచి మళ్లీ అధికారం చేపట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లు చాలా తెలివైనవాళ్లని డబ్బులకు లొంగి ఓట్లు వేసే పరిస్థితులు లేవన్నారు.

 

ఈసారి కచ్చితంగా వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని మనసులోని మాటను బయటపెట్టారు మాజీ సీఎం కిరణ్. మంత్రి పెద్దిరెడ్డి ఓ చిన్నస్థాయి గుత్తేదారని, రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదనే ధ్యేయం గా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల కమిషన్.. సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. తిరుపతి ఘటన ఈసీకి ఒక ఛాలెంజ్ అంశమన్నారు. ఓటర్లకు సెక్యూరిటీ ఇస్తే స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

 

రాజంపేట పార్లమెంట్ సీటుతోపాటు దాని పరిధిలోని అన్నీ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవడానికి అందరి కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు మాజీ సీఎం. గడిచిన ఐదేళ్లలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తనకంటే.. ప్రజలే బాగా తెలుసన్నారు.