ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప ఎంపీగా బరిలోకి దిగిన పీసీసీ ఛీఫ్ షర్మిలతో పాటు ఆమె సోదరి, సునీత, టీడీపీ వివేకా హత్య కేసును జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాయి. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో అప్రూవర్, జై భీమ్ పార్టీ తరఫున పులివెందుల బరిలో దిగుతున్న దస్తగిరి ఈసీని ఆశ్రయించారు.
తెలుగుదేశం పార్టీ, వైయస్ సునీత , వైఎస్ షర్మిలపై వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేశారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత పదేపదే వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని దస్తగిరి ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధమన్నారు.
అలాగే వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగంపై దస్తగిరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్నికల నిబంధనలో స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైయస్ సునీత, వైయస్ షర్మిల టీడీపీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని దస్తగిరి ఆరోపించారు. వీరిపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.
పులివెందుల నుండి పోటి చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్ర ఇబ్బందిగా మారబోతోందని దస్తగిరి పేర్కొన్నారు.రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అండదండలతో ఇలాంటి ఆరోపణలు చేయటం ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి వ్యతిరేకమని తెలిపారు. తక్షణం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని దస్తగిరి ఈసీని కోరారు.
ఎన్నికలు ముగిసే వరకు ఈ కేసుపై మీడియా కథనాలు కూడా ప్రచురించవద్దని మీడియాకు కూడా ఆదేశాలు ఇవ్వాలని దస్తగిరి కోరారు. ఈ కేసును టీడీపీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతుందని దస్తగిరి ఆరోపించారు. ఎన్నికల కోడ్ ను పూర్తిగా తుంగలో తొక్కి రాజకీయ ప్రసంగాలలో హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న వైఎస్ సునీత వైయస్ షర్మిల, పులివెందుల టిడిపి అభ్యర్థి బీటెక్ రవి పై చర్యలు తీసుకోవాల్సిందిగా దస్తగిరి కోరారు. దీనిపై ఈసీ వెంటన నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని దస్తగిరి తెలిపారు.