National

మణిపూర్ మౌనం.. కనిపించని ఎన్నికల హడావిడి..

మణిపూర్ గత ఏడాది నుంచి అల్లర్లతో అట్టుడికిపోయింది. మైతీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న గొడవలతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ హింసాత్మకమైన ఘటనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయ పడ్డారు. చాలా ఇళ్లు, వాహనాలు, దుకాణాలకు ఆందోళన కారులు నిప్పంటించారు. హింసాత్మక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు సురక్షితప్రాంతాలకు తరలించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు.

 

ఇక ప్రస్తుతానికి గొడవలు సద్ధుమణిగినా ఇప్పుడేం జరుగుతుందోననే ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. మణిపూర్‌లో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19, 26 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్ కు ఇంకా రెండు వారాలే సమయం ఉంది.

 

అయినా మణిపూర్ లో ఎన్నికల హడావిడి మాత్రం కనిపించడం లేదు. ఎక్కడా ర్యాలీలు, సభలు కాని నిర్వహిండంలేదు. ఇక ఎలక్షన్స్ కు తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగ్ లు మాత్రమే కనిపిస్తున్నాయి. మణిపూర్ లో భాజాపా, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. కాని ప్రచారం చేయడానికి మాత్రం నేతలు ఎవరు అక్కడికి వెల్లడం లేదు.

 

కారణం.. ఏమిటంటే అక్కడ మళ్లీ ఘర్షణలు మొదలయ్యే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శారదాదేవి అన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్న 24,000 మందికి పైగా ప్రజలు లోక్ సభ ఎన్నికలకు ఓటు వేయనున్నారు. వారంతా శిబిరాల వద్దనే ఓటు వేసేలా ఎన్నికల కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మైతీలు ఉండే లోయ ప్రాంతాలతో పాటు కుకీలు ఉండే కొండ ప్రాంతాల్లోనూ ప్రచారం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని కుకీ గ్రూపులు మాత్రం ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించాయి.