TELANGANA

ప్రయాణికులకు షాక్.. హైదరాబాద్ మెట్రో రైలులో ఆ కార్డు రద్దు..?

వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది కూడా. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు రెండు నెలల పాటు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు అమలులో ఉంది. జూన్ 1వ తేదీన తరగతులు పునఃప్రారంభమౌతాయి.

 

అలాగే- ఈ నెల 25వ తేదీ నుంచి పాఠశాలలకు హాలిడే ఉంటుంది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో ఒంటిపూట బడులు సాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఉంటాయి. పాఠశాలలకు 24వ తేదీ నుంచి వేసవి సెలవులు అమలులోకి వస్తాయి.

 

ఈ వేసవి సెలవుల్లో మెట్రో రైలులో రాయితీ కార్డు మీద నగరాన్ని చుట్టేసి రావాలనుకుంటోన్న వారికి హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయితీ కార్డులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. రాయితీ ప్రయాణాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

 

హైదరాబాద్ మెట్రో రైలులో 59 రూపాయల హాలిడే కార్డు అమలులో ఉండేది. ఈ రాయితీ కార్డును అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. దీనితో పాటు సాధారణ రోజుల్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండేలా గతంలో తీసుకొచ్చిన 10 శాతం రాయితీని కూడా ఎత్తేసినట్లు చెబుతున్నారు.

 

సాధారణ రోజుల్లో మెట్రో కార్డును ప్రయాణికులు కొనుగోలు చేస్తే- తెల్లవార జామున 6 నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణ ఛార్జీలో కల్పించే 10 శాతం రాయితీ ఉండేది. దీన్ని సైతం అధికారులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరిగినందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.