ఈ-కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారని, అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్‌పై తానేమీ మాట్లాడనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… విచారణకు గవర్నర్ అనుమతించిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… ఏసీబీకి తెలియజేస్తారన్నారు. ఈ-కార్ రేసింగ్‌లో చట్ట ప్రకారమే ఏసీబీ దర్యాఫ్తు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
గవర్నర్ అనుమతించడంపై కేబినెట్‌లో చర్చించినట్లు చెప్పారు. ఫార్ములా ఈ-రేసులో జరిగిన దోపిడీపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిందన్నారు. అయితే ఈ కేసులో ఎవరి అరెస్ట్ గురించి తాను చెప్పబోనన్నారు. ఈ-రేస్ అంశంలో అర్వింద్ కుమార్‌పై కేసుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. కానీ అవినీతిని మాత్రం ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు.
ఈ-కార్ రేస్‌పై రేపు ఏసీబీకి సీఎస్ లేఖ రాసే అవకాశముంది. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్‌కు తెలంగాణ కేబినెట్ ఆదేశించింది. ఈ-రేసింగ్ ఏజెన్సీ, నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశముంది. కాగా, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం దాదాపు 5 గంటలకు పైగా సాగింది.