AP

విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు..

వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌, కాకినాడ సెజ్‌లోని ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై. విక్రాంత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా చెప్పుకొస్తున్న పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ ప్రతినిధులకు సైతం ఈడీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. పలు కారణాలతో వీరంతా విచారణకు హాజరుకాకపోవటంతో మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు పంపింది.

 

కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి.. ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 6 తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అయితే ఇప్పటికే ఈడీ ఈ కేసులో నోటీసులు జారీ చేయగా పలు కారణాలతో విచారణకు రాలేమంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. గత నెలలో పంపిన నోటీసులకు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని.. అందుకే తాను విచారణకు హాజరుకాలేనని తెలిపారు. ఇక అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనట్టు విక్రాంత్ రెడ్డి తెలుపగా ప్రస్తుత పరిస్థితుల్లో విచారణకు రాలేనని శరత్ చంద్రారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

 

ఇక ఈ కేసులో అరబిందో రియాల్టీ అండ్ ఇంఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బలవంతంగా వాటాలు లాగేసుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ సంస్థ డైరెక్టర్లను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతుంది. తదుపరి చర్యలను ముమ్మరం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇక ఈ కేసులో ఏపీ సిఐడి సైతం తన చర్యలు ముమ్మరం చేసింది. విచారణకు హాజరు కావాలని చంద్ర రెడ్డికి ఇప్పటికే ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది.

 

వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్‌ అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించి.. కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌లోని వాటాలను బలవంతంగా బదలాయించారనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాకినాడ పోర్ట్ లోని రూ.2,500 కోట్ల విలువైన వాటాలను రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్‌లోని రూ.1,109 కోట్ల విలువైన వాటాలను రూ.12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక ఈ ఆరోపణలతో సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసింది.

 

ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న కర్నాటి వెంకటేశ్వరరావు.. కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను కొట్టేసేందుకు మాజీ సీఎం జగన్‌ పక్కా ప్రణాళిక రూపొందించారని ఆరోపిస్తూ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ప్రణాళికను విక్రాంత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి అమలు చేశారని.. అందులో భాగంగా కేఎస్‌పీఎల్‌లో స్పెషల్‌ ఆడిట్‌ చేయించారని పేర్కొన్నారు. లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు దస్త్రాలు సైతం సృష్టించారని తెలిపారు. కేఎస్‌పీఎల్‌ ప్రభుత్వానికి రూ.965.65 కోట్ల వాటా చెల్లించాలంటూ ఆడిట్‌ సంస్థతో నివేదిక ఇప్పించారని… వాటా కొనుగోలు ఒప్పందాలపై మోసపూరితంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ఈ ఫిర్యాదుతో ఈడీ విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.