దుబాయ్ నగరంలో ప్రముఖ ఐకానిక్ సింబల్‌గా ఉన్న బుర్జ్ ఖలీఫా టవర్ లాంటిదాన్ని హైదరాబాద్ శివారులో ఉనికిలోకి రానున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లోనూ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈనెల 13 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్‌లలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను పారిశ్రామికవేత్తలకు ప్రదర్శించి నిర్మాణం కోసం ముందుకు రావాల్సిందిగా కోరే అవకాశమున్నది.
గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్‌ను అక్కడి ఇన్వెస్టర్లకు పరిచయం చేశారు. దీనికి కొనసాగింపుగా నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక డిజైన్, ప్లానింగ్ గురించి ఈసారి పర్యటన సందర్భంగా వివరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ఉన్నందున ఫోర్త్ సిటీకి అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధుల రాకపోకలకు వీలుగా ఉంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనికి తోడు ప్లాన్డ్ సిటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నందున ఇండస్ట్రియల్, ఫార్మా, కమర్షియల్, టూరిజం క్లస్టర్లను ఫోర్త్ సిటీలో నెలకొల్పాలని ఆలోచిస్తున్నది. వేలాది ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కానున్నది.
ఫోర్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ’గా భావిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలుగా ఉండగా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీగా అవతరించనున్నది. ఫోర్త్ సిటీకి సింబాలిక్‌గా బుర్జ్ ఖలీఫా టవర్ లాంటిదాన్ని ఈ సిటీ మధ్యలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 300 అడుగుల వెడల్పయిన రహదారులు, వాటికి అనుసంధానించేలా రేడియల్ రోడ్లపై ఇప్పటికే రహదారుల మంత్రిత్వశాఖ స్పష్టమైన అవగాహనతో ఉన్నది.
ఎలాగూ రీజినల్ రింగు రోడ్డు ఈ సిటీ మీదుగా వెళ్తున్నందున రోడ్డు కనెక్టివిటీ కూడా సౌలభ్యంగా ఉంటుంది. స్పోర్ట్స్, స్కిల్స్ యూనివర్శిటీలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన వివిధ రంగాలను కూడా ఫోర్త్ సిటీలో భాగం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దుబాయ్ నగరంలో పక్కా ప్రణాళికతో అర్బన్ సిటీని నిర్మించినట్లుగానే హైదరాబాద్ శివారులో శంషాబాద్ అవతలి వైపు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని ప్రాంతాల్లో కొన్ని ఫోర్త్ సిటీలో భాగం కానున్నాయి.
ఇప్పటివరకూ పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతమంతా ఫోర్త్ సిటీ నిర్మాణంతో డెవలప్డ్ ప్రాంతంగా మారనున్నది. ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే సిటీగా ఆవిర్భవించనున్నది. సైబరాబాద్ ప్రాంతంలో దాదాపుగా ఖాళీ జాగా లేకుండా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటై హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పోల్చలేని తీరులో అభివృద్ధి చెందింది. దీన్నిమరిపించేలా ఫోర్త్ సిటీ ఉనికిలోకి రావాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనికి తోడు మూసీ రివర్ ఫ్రంట్ డెవప్‌మెంట్ ప్రాజెక్టుతో పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కనున్నది. దావోస్ పర్యటన తర్వాత ఏయే దేశాల కంపెనీలు ఫోర్త్ సిటీ అభివృద్ధిలో పాలుపంచుకోనున్నాయనేది స్పష్టం కానున్నది