National

కేంద్రం కొత్త రూల్..! రోడ్డు నాణ్యత బాగోలేదా అయితే వాళ్లంతా జైలుకే..?

నిత్యం రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిలో లెక్కలేనంత మంది గాయపడడమో, చనిపోవడమో జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కర్ ఆసక్తకర కామెంట్లు చేశారు. దేశంలో నాణ్యత లేని రోడ్లు వేస్తే.. అందుకు కారణమైన వాళ్లను జైలుకు పంపాలంటూ వ్యాఖ్యానించారు. అవినీతి, అత్యాశ, లంచాలతో రోడ్ల నాణ్యతకు తూట్లు పొడిచేవారిని విడిచిపెట్టవద్దంటూ ఘాటూ వ్యాఖ్యాలు చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యాలు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

 

ప్రభుత్వం కాంట్రాక్టలు అంటేనే ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తారు అనే అభిప్రాయం బలంగా ఉంది. చాలా మంది కాంట్రాక్టర్లు సరైన ప్రమాణాలు పాటించకుండానే పనులు ముగిస్తారనే వాదనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా.. ఓ సారి రోడ్డు పడి, డబ్బులు తీసుకున్న తర్వాత ఎలా ఉంటే మనకెందుకులే అనేది కాంట్రాక్టర్ల ధోరణి. కానీ.. అలాంటి వారి వల్ల అమాయకుల జీవితాలు బలైపోతున్నాయని అంటున్నారు.. కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కాబట్టి.. నాణ్యత లేని రోడ్డు నిర్మాణాలను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించి.. సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజినీర్లపై కేసులు నమోదు చేయాలని అన్నారు.

 

రోడ్డు ప్రమాదాలకు.. ప్రయాణికుల తప్పులతో పాటు రోడ్డు నాణ్యతా ప్రధాన కారణమే అన్న కేంద్ర మంత్రి.. బాధ్యులైన వారిని జైలుకు పంపితేనే మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. భారత్ లో రోడ్డు ప్రమాదాల తీవ్రత అధికంగా ఉందని అన్నారు. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చితే.. భారత్ ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు. చాన్నాళ్లుగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నా.. సరైన ఫలితాలు ఉండడం లేదని ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. రోడ్డు ప్రమాద మరణాలను 2030 నాటికి సగానికి సగం తగ్గించాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

 

దేశంలోని రోడ్లపై నిత్యం ఎక్కడో ఓ చోట తీవ్ర ప్రమాదాలు జరుగుతుండగా.. 2023 లో ఐదు లక్షల ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. ఇందులో లక్షా 72 వేల మంది మృత్యువాత పడినట్లు తెలిపిన కేంద్ర మంత్రి.. ఇందులో లక్షా 14 వేల మంది 18 – 45 మధ్య వయసు వారని తెలిపారు. అంతే కాదు..ఆ ఏడాది చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఏకంగా 10 వేల మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపారు. ఇక.. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల 30 వేల మంది, హెల్మెట్ ధరించకపోవడం వల్ల 55 వేల మంది చనిపోయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

 

హైవేలపై ప్రమాదాల్ని నివారించేందుకు కేంద్ర చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి.. హైవేలపై బ్లాక్ స్పాట్ లను మెరుగుపరిచేందుకు రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాలను.. ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే.. నైపుణ్యాలు, మంచి శిక్షణ ఉన్న డ్రైవర్ల కొరత వేధిస్తున్న విషయాన్ని గుర్తించామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు డ్రైవర్ల శిక్షణ, ఫిట్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం.. పరిశ్రమలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు.

 

చాలా దేశాల్లో డ్రైవర్లు 8 గంటలకు మించి పని చేయరని, కానీ మన దగ్గర 15-18 గంటలు దాటినా పని చేస్తూనే ఉంటారని తెలిపారు. అందుకే.. తెల్లవారుజామున, నిద్ర సరిపోని కారణంగా జరిగే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. డ్రైవర్లు అలసట, నిద్రలేమితో ఉంటే గుర్తించేలా భారత ట్రక్కుల్లో ప్రత్యేక డివైస్‌లను అమర్చాలని నిర్ణయించినట్లు గడ్కరీ తెలిపారు.