TELANGANA

హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ వార్నింగ్..

హైదరాబాద్‌లో హైడ్రా దూసుకుపోతోంది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్లి యాక్షన్ షురూ చేస్తోంది హైడ్రా టీం. అయితే బాధితుల సమస్యలు వినడానికి వెళ్ళిన హైడ్రా కమిషనర్ కు .. హైకోర్టు న్యాయవాదికి మధ్య వివాదం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 

ఈ ఘటనకు సంబంధించి పవర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్లాట్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పర్యటించారు. రంగనాథ్‌ అక్కడికి వెళ్లారు. తమ ప్లాట్లు కబ్జా చేస్తున్నారంటూ బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పర్యటించిన హైడ్రా కమిషనర్‌ బాధితుల సమస్యలు విన్నారు. ఈ క్రమంలో హైకోర్టు న్యాయవాది ముఖీం జోక్యం చేసుకోవడంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

 

కోర్టు ఉత్తర్వులున్నా, వాటిని ఉల్లంఘించి ఇళ్లను కూలగొట్టారని సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ప్రశ్నించారు. దీనిపై మీరు కంటెప్ట్ పిటిషన్ వేసుకోండని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమాధానమిచ్చారు. కేసు న్యాయస్థానం ముందు ఉన్నప్పుడు ఐలాపూర్‌ను ఎలా సందర్శిస్తారని న్యాయవాది రంగనాథ్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓవర్ యాక్షన్ చేయవద్దని న్యాయవాదిని రంగనాథ్ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది.

 

అలానే రంగనాథ్‌ మాట్లాడుతూ.. ప్లాట్ల విషయంలో కొనుగోలుదారులను కొందరు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని అన్నారు. రెండు వారాల్లో దీనిపై లోతుగా పరిశీలించి ఇరువర్గాలు చెప్పింది వింటామని స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటాం. అన్ని అంశాలను పరిశీలించి 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తాం అని తెలిపారు.