గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 నిమ్మా లక్ష్మీపతికి కూడా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వీరిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని గురువారం ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు. 8 గంటలకు పైగా విచారించిన అనంతరం, వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి… వల్లభనేని వంశీ సహా ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.
ప్రభుత్వం తరుఫున వీరగంధం రాజేంద్రప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2.30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ ముగ్గురికీ 14 రోజుల రిమాండ్ విధించారు.
మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. సత్యవర్ధన్ ను బెదిరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు. చంపేస్తారనే భయంతో సత్యవర్ధన్… వంశీ అనుచరులు చెప్పినట్టు చేశారని తెలిపారు. సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.