AP

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్‌.. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు..

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. వర్షాకాలం ముగిసి, పనుల సీజన్‌ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారుల ఆదేశించారు. నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న సీఎం. ఒక డ్రైవ్‌ కింద తీసుకుని రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని సూచించారు. సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్‌ చేసి.. వినియోగించేలా చూడాలన్న ముఖ్యమంత్రి. దీనివల్ల చాలావరకు తాగునీటిని ఆదా చేయగలుగుతామన్నారు.

ఇక, విశాఖ సిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్‌కు వివరించిన అధికారులు.. ఒక్క విశాఖ నగరంలోనే నాలుగేళ్లకాలంలో రూ.3592 కోట్ల మేర రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా, వీధిలైట్లు, పార్కులు, వాటర్‌ బాడీలు, సుందరీకరణ, మురుగునీటి శుద్ధి, వివిధ భవనాల నిర్మాణం, పౌరులకు సేవలకోసం ఖర్చుచేసినట్టు వెల్లడించారు.. అయితే, విశాఖలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్‌ నిర్వహణమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు సీఎం.. రానురాను జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. జీవీఎంసీ నూతన భవన నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.. 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రూ.100 కోట్లతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయ నిర్మాణం జరుగుతంది.. రూ.300 కోట్లతో విశాఖ నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనా ప్రాజెక్టు కింద త్వరలో పనులు ప్రారంభం అవుతాయి.. దీనికింద ముడసర్లోవ పార్క్‌ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో కమర్షియల్‌ కాంప్లెక్స్, మల్టీ లెవల్‌ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టనున్నారు.

మరోవైపు.. విజయవాడలో అభివృద్ధిపనుల పురోగతిని సీఎంకు వివరించారు అధికారులు. అంబేద్కర్‌ స్మృతివనం పనులను వేగతవంతం చేయాలన్న సీఎం. కన్వెన్షన్‌ సెంటర్‌ పనులు కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. పార్క్‌లో గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. విజయవాడలో కాల్వలు, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అత్యాధునిక యంత్రాలను దీనికోసం వినియోగించుకోవాలన్న ఆయన.. విజయవాడ విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ పనులను కూడా పూర్తిచేయాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఈ సమీక్షా సమావేశంలో రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎంకు వివరించారు అధికారులు. కంబాల చెరువు సహా వివిధ ప్రాంతాల్లో సుందరీకరణ పనులు పూర్తయ్యాయన్న అధికారులు. అయితే, రాజమండ్రి హేవ్‌లాక్‌ బ్రిడ్జి సుందరీకరణ సహా ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. వరదల కారణంగా నెల్లూరు మునిగిపోయే పరిస్థితులు రాకుండా రక్షణ గోడ నిర్మాణం పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఇక, టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లను ఏర్పాటుచేసి వారిద్వారా నిర్వహణ చేయాలన్న సీఎం. జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలన్నారు. నగరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నాం. ప్లోటింగ్‌ సోలార్‌ ప్యానెల్స్, ఎస్‌టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం అత్యాధునిక యంత్రాలు తదితర వాటిని వివిధ ప్రాజెక్టుల కింద తీసుకువస్తున్నాం. వీటి నిర్వహణ అన్నది చాలా ముఖ్యం, లేకపోతే అవి మూలనపడతాయి. వాటి నిర్వహణకోసం అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవవనరుల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల్లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకోసం అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధిచేయాలని.. ఈ ప్రాజెక్టుల నిర్వహణకోసం ప్రత్యేక ఎస్‌ఓపీ కూడా ఉండాలని ఆధికారులను ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.