AP

వైసీపీపై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో వైసీపీ కొత్త ఎత్తులకు పాల్పడుతుందా? కూటమి ప్రభుత్వంపై యువత, నిరుద్యోగులు అసహించుకునే స్కెచ్ వేసిందా? మంత్రి నారా లోకేష్ ఎందుకు ఆ మాటలు అన్నారు? డీఎస్సీపై వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కారణమేంటి? అన్నదే ఇప్పుడు అసలు చర్చ.

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 16 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులు సైతం స్వీకరించింది. అయితే దరఖాస్తు విషయంలో పలు సమస్యలు తలెత్తడంతో వానికి కరెక్టు చేసింది కూడా. రేపో మాపో పరీక్షరాసేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు.

ఎలాగైనా డీఎస్సీలో ఉద్యోగం సంపాదించేందుకు డే అండ్ నైట్ హార్డ్‌ వర్క్ చేస్తున్నారు అభ్యర్థులు.  ఇదే సమయంలో విద్యా శాఖ మంత్రి లోకేష్ ఓ బాంబు పేల్చారు. డీఎస్సీ-2025ని ఆపేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్లిందన్నారు.

సమయం పెంచాలని అంటున్నారని, గత డిసెంబర్‌లో సిలబస్ ప్రకటించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు సదరు మంత్రి. జగన్‌కు సిలబస్ అంటే ఏంటో తెలియదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

సాక్షాత్తూ మంత్రి లోకేష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించడంపై అభ్యర్థుల్లో అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ దీనిపై న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉండబోతోందని చర్చ అప్పుడే మొదలైంది. అయినా వైసీపీ ఇలాంటి కుట్రలకు ఎందుకు పాల్పడుతోందని అంటున్నారు. కొందరు అభ్యర్థులు ఆ పార్టీపై అప్పుడు రుసరుసలాడుతున్నారు.

ఈ లెక్కన డీఎస్సీ అభ్యర్థులను ముందుగానే అలర్ట్ చేశారు మంత్రి లోకేష్. చాన్నాళ్లు తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసీపీ ఇప్పుడు కోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. ఈ వ్యవహరం వైసీపీలో ఇంకెంత కాక రేపుతుందో చూడాలి.

గురువారం అనంతపురం జిల్లాకు వచ్చారు మంత్రి లోకేష్. గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే సందర్భంలో డీఎస్సీ-2025పై ఆయన వ్యాఖ్యలు చేశారు.

రెడ్ బుక్ గురించి కార్యకర్తలు అడుగుతున్నారని, మన కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినవారిని ఏ మాత్రం వదిలిపెట్టనని కుండబద్దలు కొట్టేశారు. గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలుసని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలనికి కొంత సమయం పడుతుందన్నారు.