AP

పవన్ కి బీజేపీ ఓ పాఠం..

ఓటమి గుణపాఠాన్ని నేర్పుతుందంటారు. కానీ ఓటమిని ఎవరు కోరుకోరు. దానిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచన ఎవరికీ అంతు పట్టడం లేదు. తెలంగాణలో బిజెపితో కలిసి నడిచారు. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేశారు. ఒక్క కూకట్ పల్లి లో మాత్రమే జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ గరిష్టంగా 39,830 ఓట్లు దక్కించుకున్నారు. మిగిలిన చోట్ల సరాసరి 2వేల నుంచి 3000 వరకు ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ 3000 ఓట్లు రావడం బాధాకరం. కనీసం బర్రెల అక్కకు వచ్చిన ఓట్లు రాలేదన్న విమర్శను జనసేన అభ్యర్థులు మూటగట్టుకున్నారు.

 

More

From Ap politics

తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకోవడం పవన్ చేసుకున్న సాహసం. అక్కడ బలమైన నాయకత్వం కొరవడింది. బండి సంజయ్ లాంటి నాయకత్వం తప్పించిన తర్వాత బిజెపి ఏరి కోరి కష్టాలను తెచ్చుకుంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే తరహా ప్రయత్నం చేసి బిజెపి చేతులు కాల్చుకుంది. కొన్నేళ్ల కిందట 31 ఎమ్మెల్యే స్థానాలతో ఢిల్లీలో మంచి పొజిషన్లో ఉన్న బిజెపి హర్ష కుమార్ అనే నేతను పక్కకు తప్పించి కిరణ్ బేడీని తెరపైకి తెచ్చింది. క్యాడర్ మనోభావాలను గుర్తించకుండా చేసిన ఈ ప్రయత్నం విఫలయత్నంగా మారింది. బిజెపికి కోల్పోలేని దెబ్బతీసింది. ఇక్కడ బండి సంజయ్ విషయంలో సైతం దిగువ స్థాయి కేడర్ అభిప్రాయాన్ని బిజెపి గుర్తించలేకపోయింది. ఓటమికి అదే ప్రధాన కారణం అయ్యింది. బిజెపి వెంట నడిచి పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.

 

ఇంత జరుగుతున్నా పవన్ తన వ్యూహం మార్చుకోవడం లేదు. ఏపీ విషయంలో అదే తప్పును కొనసాగిస్తున్నారు. టిడిపి పై అంతులేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. టిడిపి విషయంలో సొంత పార్టీ శ్రేణులని తప్పుపడుతున్నారు. తనను అభిమానించే వారిని సైతం ఆలోచనలో పెట్టేస్తున్నారు. తనను ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారని.. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఇటీవల సొంత వారినే నిలదీశారు.పార్టీ క్యాడర్ మనోభావాలను గుర్తించకుండా ఢిల్లీలో బిజెపి దెబ్బతింది.తరువాత తెలంగాణలో సైతం ఇదే తరహా గుణపాఠం బిజెపికి ఎదురయింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న బిజెపికే ఈ తరహా పరిస్థితులు ఎదురైతే.. సొంత పార్టీ శ్రేణులను నిలదీస్తే, తప్పు పడితే నష్టం జరుగుతుందని పవన్ కు తెలియదా? బిజెపిని చూసైనా గుణపాఠాలు నేర్చుకోరా? అన్న ప్రశ్న జన సైనికుల నుంచి వినిపిస్తోంది.