TELANGANA

కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలు.. స్పందించిన కొండా సురేఖ.

తనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి కాగ్నిజెన్స్ తీసుకుని ముందుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఈ దేశ న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. కేసులు, కొట్లాటలు తనకు కొత్తేమీ కాదని అన్నారు.

 

తన జీవితమే ఒక పోరాటమని, ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమే అని ఆమె అన్నారు. ఇది జరిగి రెండు రోజులయిందని, కానీ కొన్ని ఛానల్స్ తన కేసులో ‘సంచలనం.. బిగ్ బ్రేకింగ్..’ అంటూ వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొందరి ఉత్సాహం చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని ఆమె అన్నారు.

 

కొండా సురేఖ అనే పేరు వినగానే కొంతమంది రిపోర్టర్లు తన కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని మీడియా, సోషల్ మీడియాల్లో రాస్తున్నారని ఆమె అన్నారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. అయితే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆమె పేర్కొన్నారు.