గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అస్తవ్యస్తంగా చేపట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తొందరపాటు చర్యలు, ఒత్తిళ్లతో జిల్లాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటులో సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని… ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని తెలిపారు. ఈరోజు నుంచి ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్లకు ఇవ్వొచ్చని చెప్పారు.
అన్ని అంశాలపై చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇస్తామని తెలిపారు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి జిల్లాల సరిహద్దుల మార్పుల ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. కేవలం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులను మాత్రమే మారుస్తామని… నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు మాత్రం చేయడం లేదని చెప్పారు. జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని తెలిపారు.