AP

చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకంటే..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఫిర్యాదు చేసింది.

 

సీఈవో ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈసీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ప్రాథమికంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని సీఈవో నోటీసులు జారీ చేశారు.

 

కాగా, ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కారు, సీఎం జగన్‌పై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా,తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.

 

వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్‌ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారం చేసి, ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి బీజేపీతో జట్టు కట్టామని స్పష్టం చేశారు. మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జట్టు కట్టామని, జగన్‌కు శవరాజకీయాలు చేయడం అలవాటు అని ధ్వజమెత్తారు.