AP

ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు మహర్థశ..! ఏపీలో ఐదు డిఫెన్స్ క్లస్టర్లు..!

అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ఏపీలో చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ప్రాంతాన్ని బట్టి ఏయే రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామో కలెక్టర్లకు వివిధ శాఖల కార్యదర్శులు వివరించారు. ఏడాదిగా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల గురించి జిల్లాల కలెక్టర్ల సమావేశంలో తెలియజేశారు.

 

ఏదైనా సమస్యలు వస్తే వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టనున్న పారిశ్రామిక వేత్తలతో కలెక్టర్లు మాట్లాడాలని సంకేతాలు ఇచ్చేసింది ప్రభుత్వం. ఏపీలోని ఐదు డిఫెన్స్ క్లస్టర్లుగా ప్లాన్ చేసింది కూటమి సర్కార్. అందులో ఉత్తరాంధ్ర-రాయలసీమకు మహార్ధశ పట్టనుంది. శ్రీకాకుళం టు విశాఖ మధ్యలో నేవల్ క్లస్టర్ రానుంది. అందుకోసం 3 వేల ఎకరాల భూమి కేటాయించనుంది.

 

ఈ విషయాన్ని ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్ స్వయంగా ప్రకటన చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో 3 వేల ఎకరాల్లో క్షిపణి- మందుగుండు సామగ్రి క్లస్టర్ రానుంది. ఇక సీమ విషయానికొస్తే కర్నూలు జిల్లా ఓర్వకల్ సమీపంలో 3 వేల ఎకరాలు మానవ రహిత వ్యవస్థల క్లస్టర్ కేటాయించింది.

 

అనంతపురం జిల్లా మడకశిర-లేపాక్షి ప్రాంతాల మధ్య 4 నుంచి 5 ఎకరాలలో ఏరోస్పేస్-ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు నిర్మించనుంది. ప్రకాశం జిల్లా దొనకొండలో విమాన భాగాల తయారీ క్లస్టర్ కోసం 4 వేల ఎకరాలు కేటాయించింది. ఇప్పటికే ప్రభుత్వంతో మంతనాలు జరిగిన పలు సంస్థలకు వారు పెట్టే పరిశ్రమను బట్టి ఆ ప్రాంతాల్లో భూములను కేటాయించనుంది ప్రభుత్వం.

 

ఒకవిధంగా చెప్పాలంటే నేవీ విభాగానికి ఉత్తరాంధ్ర కీలక కానుంది. ఏవియేషన్ పరిశ్రమకు కేరాఫ్‌గా రాయలసీమ ప్రాంతం అభివృద్ది చెందనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఐదు ప్రధాన రక్షణ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్ ప్రకటించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

 

జిఎస్‌డిపికి పారిశ్రామిక రంగం 44 శాతం వాటాను అందిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడంతో సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలంలో 14 విభాగాలకు సంబంధించి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు.

 

మొత్తం 122 ప్రాజెక్టులను ఆమోదించిందని ఆయన తెలియజేశారు. 50కి పైగా ప్రాజెక్టులను కేంద్రం ఇప్పటికే ఆమోదించిందన్నారు. జిల్లాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల గురించి తెలుసుకునేందుకు కలెక్టర్లకు నేరుగా దానికి సంబంధించిన వెబ్ పోర్టల్‌ లో లాగిన్ అయ్యేలా సదుపాయం కల్పించినట్టు తెలిపారు.