CINEMA

పైరసీపై చర్యల మధ్య నాగార్జున: మా కుటుంబంలోనూ ‘డిజిటల్ అరెస్ట్’

ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడి అరెస్టుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో హీరో నాగార్జున స్పందించారు. పైరసీని అరికట్టడంలో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఈ అరెస్టు సినీ పరిశ్రమకు మంచి జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా, తమ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, తమ కుటుంబంలోనూ ఒకరు ‘డిజిటల్ అరెస్ట్’కు గురయ్యారని నాగార్జున వెల్లడించారు.

తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని సైబర్ నేరగాళ్లు దాదాపు రెండు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారని నాగార్జున ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆన్‌లైన్ పైరసీ వెబ్‌సైట్లు ఉచితంగా సినిమాలు చూపిస్తున్నట్లు కనిపించినా, వాటి ద్వారా తమ వివరాలను సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నట్లే అవుతుందని ఆయన హెచ్చరించారు.

వెబ్‌సైట్ల కోసం వ్యక్తిగత వివరాలను అందించడం ద్వారా డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని, ఉచితంగా సినిమా చూస్తున్నామని భావించినా అది పరోక్షంగా సైబర్ నేరాలకు సహకరించినట్లే అవుతుందని నాగార్జున తెలిపారు. ప్రజలు ఈ సైబర్ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.