బెంగళూరు నగరంలోని హెబ్బల్‌లో ఉన్న ఓ ప్రముఖ పబ్ తన మూడో వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ఆఫర్ స్థానికంగా తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ‘ఏమి ఆర్డర్ ఇచ్చినా రూ. 30 మాత్రమే’ అనే ఆఫర్‌ను సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేయడంతో, ఆ రోజు పబ్‌కు ప్రజలు భారీగా ఎగబడ్డారు. కేవలం 300 మంది సామర్థ్యం ఉన్న పబ్ వద్దకు 1,000 మందికి పైగా జనం తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ కారణంగా, పబ్ యాజమాన్యం నిర్ణీత సమయానికి 4 గంటలకు ముందే మూసివేయాల్సి వచ్చింది.
ఈ ఊహించని రద్దీ వల్ల కెంపపురా మెయిన్ రోడ్, ఎస్టీమ్ మాల్ రోడ్, ముఖ్యంగా హెబ్బల్ ఫ్లైఓవర్ మీద పీక్ అవర్స్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు రోడ్డు మీదే ఆగిపోయి, ట్రాఫిక్ పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఆఫర్ టైమింగ్‌లు స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల జనం మధ్యాహ్నం నుంచే రావడం మొదలుపెట్టారు. మొదటి బ్యాచ్‌ను మధ్యాహ్నం 12:30కే లోపలికి అనుమతించినా, 1 గంటకు ఆఫర్ ముగిసిందని ప్రకటించినా, కొత్తగా వచ్చిన జనం వెనక్కి తగ్గలేదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పబ్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. పబ్ యజమానులు తాము ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని చెబుతున్నారు. అయితే, ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లకు ముందుగానే పోలీసుల అనుమతి తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, చిన్న డిస్కౌంట్ కోసం కూడా గంటల తరబడి క్యూలో నిలుచునే ప్రజల ‘ఉచితాల క్రేజ్’ మనస్తత్వంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

