తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయని పేర్కొంది. ఈ శీతల గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా తగ్గాయి.
ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం, శనివారం శీతల, అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. ఈ జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రానున్న రోజుల్లో పొగమంచు పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారి పేర్కొన్నారు. శీతల గాలులు, పొగమంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెరుగుతున్న చలి దృష్ట్యా ప్రభుత్వం పౌరులకు అవసరమైన హెచ్చరికలను జారీ చేసింది.

