CINEMA

‘దురంధర్ 2’లో విలన్‌గా నాగార్జున? బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల సునామీ!

రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కేవలం హిందీ భాషలోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే 960 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ స్పై థ్రిల్లర్, పుష్ప 2 మరియు బాహుబలి 2 వంటి సినిమాల రికార్డులను సైతం సవాల్ చేస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కాబోతున్న సీక్వెల్ ‘దురంధర్ 2’పై పడింది.

మొదటి భాగం భారీ విజయం సాధించడంతో, సీక్వెల్‌లో విలన్ పాత్ర కోసం మేకర్స్ మరింత పవర్ ఫుల్ నటుడిని ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల ‘కూలీ’ సినిమాలో విలన్ రోల్ పోషించిన నాగ్, తనలోని కొత్త కోణాన్ని చూపించారు. అయితే ‘దురంధర్ 2’లో ఆయనకు హీరోతో సమానమైన ప్రాధాన్యత కలిగిన, స్టైలిష్ విలన్ రోల్‌ను ఆఫర్ చేసినట్లు సమాచారం. మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా ఏ స్థాయిలో రక్తికట్టించారో, పార్ట్ 2లో నాగార్జున అంతకంటే పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సీక్వెల్‌ను కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా పాన్-ఇండియా రేంజ్‌లో భారీగా విడుదల చేయనున్నారు. నాగార్జున వంటి స్టార్ హీరో విలన్‌గా కనిపిస్తే సౌత్ మార్కెట్‌లో కూడా సినిమాకు తిరుగుండదని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘కూలీ’లో తన పాత్రపై అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్‌కు, ‘దురంధర్ 2’ నాగ్ అసలైన కంబ్యాక్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని వందల కోట్లను కొల్లగొడుతుందో చూడాలి.