నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతున్న ఆయన, ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK 111’ అనే భారీ హిస్టారికల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా తన లుక్‌ను మార్చుకుని, పకడ్బందీ ప్రణాళికతో బ్లాక్ బస్టర్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బాలయ్య చేయాల్సిన సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కెరీర్ తొలినాళ్లలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.
బాలయ్య మాస్ ఇమేజ్‌కు, త్రివిక్రమ్ క్లాస్ మేకింగ్‌కు పొంతన కుదరదని కొందరు భావించినప్పటికీ, త్రివిక్రమ్ మాత్రం బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేశారట. బాలయ్యలోని కామెడీ యాంగిల్‌ను కూడా ఈ సినిమాలో ఎలివేట్ చేయాలని త్రివిక్రమ్ భావించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక అప్పట్లో పట్టాలెక్కి ఉంటే, బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్ అయ్యేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఇటు త్రివిక్రమ్ ప్రాసలు కలిస్తే ఆ కిక్కే వేరుగా ఉండేదని ఫ్యాన్స్ ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా తన మార్క్ సినిమాలతో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్‌తో ఆయన ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’ అనే క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 10 నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అటు బాలయ్య తన మాస్ పవర్ చూపిస్తుంటే, ఇటు త్రివిక్రమ్ తన ఫ్యామిలీ మ్యాజిక్‌తో 2026 సమ్మర్లో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు భవిష్యత్తులో ఎప్పుడైనా కలిసి పనిచేస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

