తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పింది. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల ఆంక్షలు – నోటీసుల పర్వం
ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలుపుతున్న వైసీపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నోటీసులు జారీ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డిలకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. శాంతియుత పూజా కార్యక్రమాలను కూడా అడ్డుకోవడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను అస్త్రంగా వాడుకుంటున్నారని నేతలు విమర్శించారు.
ఉత్తరాంధ్రలో ధర్మపోరాటం..
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. సత్యవరం జంక్షన్ వద్ద గల శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుమల వంటి పుణ్యక్షేత్రంపై రాజకీయ ముద్ర వేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. భక్తి ముసుగులో అపవిత్ర పనులకు పాల్పడుతున్న వారిని చైర్మన్ పదవిలో ఉంచడం స్వామివారికి చేసే అపచారమని, బీఆర్ నాయుడిని తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
నంద్యాలలో నిరసన.. ‘అశ్లీలతకు టీటీడీలో చోటు లేదు’
నంద్యాల పట్టణంలోని నడిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్సీ ఇసాక్ బాష ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీఆర్ నాయుడు అశ్లీల, అసభ్యకర వ్యవహారాల్లో ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో, అలాంటి వ్యక్తి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును ఆయన తప్పుబట్టారు. నిజాలు మాట్లాడే వారిపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ నుంచి గోదావరి వరకు.. గొంతెత్తిన నేతలు
జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో నిరసనలు మిన్నంటాయి. బీఆర్ నాయుడి భాష, ఆయన పూర్వాపరాలు తిరుమల పవిత్రతను దిగజారుస్తున్నాయని రామసుబ్బారెడ్డి విమర్శించగా.. బూతు బాగోతాలు వెలుగులోకి వచ్చినా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని కారుమూరి ప్రశ్నించారు. తక్షణమే ఆయనను పదవి నుండి బర్తరఫ్ చేయాలని, లేనిపక్షంలో కోట్లాది మంది భక్తుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు.
దేవుని కడపలో శాంతియుత నిరసన..
కడప నగరంలోని అత్యంత పవిత్రమైన ‘దేవుని కడప’ శ్రీ వేంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ నిరసనను తెలియజేయాలని వైసీపీ నిర్ణయించింది. కేవలం భక్తుల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, దీనిని పోలీసు బలగాలతో అణచివేయాలని చూడటం అప్రజాస్వామికమని అంజాద్ బాషా పేర్కొన్నారు. శ్రీవారి ప్రతిష్టను గంగలో కలిపే ప్రయత్నం చేస్తున్న వారికి కాలమే బుద్ధి చెబుతుందని వైసీపీ శ్రేణులు ఈ సందర్భంగా నినదించాయి.

