కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు కేవలం సాంకేతికపరమైన అంశాలకే పరిమితమని, అవినీతి జరగలేదని కోర్టు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
కోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కానీ, దాని విచారణను కానీ తప్పుబట్టలేదని… కేవలం నివేదిక రూపకల్పనలో అనుసరించిన విధానాన్ని మాత్రమే ప్రశ్నించిందని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నది జగమెరిగిన సత్యమని, బాధ్యులైన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.
గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు కాళేశ్వరంను ‘ఏటీఎం’తో పోల్చారని గుర్తు చేస్తూ… కాళేశ్వరం అంశంపై ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్లే ఈ కుంభకోణంపై కేంద్రం మౌనంగా ఉందని ఆయన ఆరోపించారు.

