TELANGANA

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రిపరేషన్ సాగుతోందా..?

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలకు ఇప్పుటి నుంచే బీఆర్ఎస్ ప్రిపరేషన్ సాగుతోందా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని కేడర్‌ను సిద్ధం చేస్తోందా? ఈ నేపథ్యంలో రోజుకో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశాలకు ఆ పార్టీ ప్లాన్ చేసిందా? కేడర్‌లో ఉత్సాహాన్ని నూరిపోయే ప్రయత్నం చేస్తోందా? అదే సమయంలో అధికార పార్టీ వ్యాఖ్యలపై కౌంటరిచ్చే ప్రయత్నం చేస్తోంది.

 

గ్రేటర్‌లో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలకు ఇప్పటి నుంచి రెడీ అవుతోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ చేసింది. గ్రేటర్‌లో పట్టు సడల్లేదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం అంబర్‌పేట్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అధికారం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు.

 

హైదరాబాద్ సిటీ పరిధిలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వం పైన పోరాటం చేసిన వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు కేటీఆర్. గెలుపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా కార్పొరేటర్ అభ్యర్థులకు అవకాశం ఇస్తుందని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అన్యాయాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఒక్క ఇల్లు కట్టని రేవంత్ సర్కార్, హైడ్రా పేరుతో వేల ఇళ్లు కూలగొట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ సిటీలో లక్ష ఇళ్లు నిర్మాణం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఇళ్లు కూలగొట్టిందన్నారు.

 

అదే సమయంలో గడిచిన రెండు రోజులుగా అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలు వచ్చి పోయాయని వివరించారు. 25 ఏళ్లు పైబడి నిలిచినవి రెండే రెండు పార్టీలన్నారు. ఒకటి టీడీపీ కాగా, రెండోది బీఆర్ఎస్ అని చెప్పారు. ఎన్టీఆర్.. సూపర్‌స్టార్, సినీ నటుడని అన్నారు. దేవుడి రూపంలో ఎన్టీఆర్ ఫోటో ఆ రోజు అందరి ఇళ్లలో ఉండేదన్నారు. ఆయన సాధించిన సక్సెస్ వేరని, ఆయనకుండే సపోర్టు వేరన్నారు.

 

కేసీఆర్ పార్టీ స్థాపించినప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు. దాసరి నారాయణరావు నటించిన స్వయంవరం సినిమాలోని పాటను ఈ సందర్భంగా వినిపించారు కేటీఆర్. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతున్నారని, కేసీఆర్ సినీ స్టార్ కాదన్నారు. మనీ, మీడియా, మజిల్ పవర్ లేదన్నారు. కుల, ధన బలం అంతకంటే లేదని గుర్తు చేశారు.

 

హైదరాబాద్ నగరాన్ని పట్టించుకునే శక్తి లేదు కానీ, ఫ్యూచర్ సిటీ అంటూ అడ్డగోలు మాటలు చెబుతున్నారని విమర్శించారు. నగరంలో కనీసం మోరి తీసి చెత్త ఎత్తే పరిస్థితి లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే ఎవరూ నమ్మరన్నారు. ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతారంటే పట్టించుకునేది ఎవరని ప్రశ్నించారు.