AP

కుప్పంలోనూ బంగారం నిక్షేపాలు ఉన్నాయంటున్నారు… వెలికితీస్తాం: సీఎం చంద్రబాబు..

తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా, దేశానికే ఆదర్శంగా నిలిపే ‘స్వర్ణ కుప్పం’ నిర్మాణానికి నాంది పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా… రూ.118 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక ఆర్టీసీ బస్ స్టేషన్, డిపో పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూనే గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

 

కుప్పంలోనూ బంగారు గనులు

కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు కుప్పం ప్రాంతంలోనూ బంగారు గనులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు సంచలన విషయం వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ బంగారు నిక్షేపాలను వెలికితీసి, ‘స్వర్ణ కుప్పం’ ఆవిష్కరణకు నిజమైన అర్థం కల్పిస్తామని ప్రకటించారు.

 

మైక్రో ఇరిగేషన్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిన కుప్పం మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. హంద్రీ-నీవా జలాలతో 110 చెరువులు నింపామని గుర్తుచేశారు. రాయలసీమను ఉద్యాన హబ్‍గా మార్చే ‘పూర్వోదయ’ ప్రాజెక్టుకు వచ్చే నెల మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

 

ఉద్యోగాల కేంద్రంగా కుప్పం

ఒకప్పుడు ఎన్టీఆర్ హయాంలో కుప్పంలో బస్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు అదే స్థానంలో సౌర విద్యుత్ వంటి ఆధునిక సదుపాయాలతో మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా మార్చే క్రమంలో పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. “ఉద్యోగాల కోసం కుప్పం యువత బయటకు వెళ్లడం కాదు, ఇతర ప్రాంతాల వారు ఉద్యోగాల కోసం కుప్పానికి వచ్చే పరిస్థితి కల్పిస్తాం” అని ఆయన ఉద్ఘాటించారు.

 

ఒక్క రోజులోనే రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా సుమారు 80 వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రఖ్యాత అడిడాస్ ఫుట్‌వేర్ సంస్థతో పాటు టూ సీటర్ ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కుప్పానికి వస్తున్నాయని వెల్లడించారు.

 

కాలుష్య రహిత, సుస్థిర అభివృద్ధి

ఎస్సీ, ఎస్టీలకు సోలార్ రూఫ్‌టాప్ ద్వారా ఉచిత విద్యుత్, బీసీ, ఓసీలకు రూ.552 కోట్లతో సౌర విద్యుత్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ‘నెట్ జీరో’ విధానంలో భాగంగా ఇళ్లపైనే కూరగాయలు పండించుకోవడం, ఈ-సైకిళ్ల వాడకం పెంచి కుప్పాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కుప్పంలోని బ్లూ గ్రానైట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ‘హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

 

గత పాలనపై తీవ్ర విమర్శలు

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కుప్పంపై కక్ష కట్టిందని, అభివృద్ధిని అడ్డుకుందని చంద్రబాబు ఆరోపించారు. “నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడారు. 2019-24 మధ్య నన్ను నా నియోజకవర్గంలోనే తిరగనివ్వకుండా అడ్డంకులు సృష్టించారు. నాకు సహకరించిన వారిని వేధించారు” అని మండిపడ్డారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇప్పుడు అభివృద్ధే తమ అజెండా అని స్పష్టం చేశారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి డ్రామా, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఘటనలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎండగట్టారు.

 

‘మావిగన్’ అంటూ గొడ్డలి పార్టీ వింత వాదన

రాజధానిపై గత ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడిందని విమర్శించారు. ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కోరుకుంటుంటే, ‘గొడ్డలి పార్టీ’ మాత్రం వాటికన్ తరహాలో ‘మావిగన్’ కావాలంటోందని ఎద్దేవా చేశారు. గొడ్డలి పార్టీ అని తాము అనడం కాదని, వారే అంగీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

 

కుప్పం అభివృద్ధికి సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ వంటి సంస్థల సహకారంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా భాగస్వామ్యంతో కుప్పాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.