POLITICSTELANGANA

కాంగ్రెస్ పార్టీ రేవంత్ మీదనే ఎన్నో ఆశలు

రేవంత్ రెడ్డి… ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక దిక్కు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ మీదనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికో తీసుకెళ్తాడని అంతా భావించారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా అదే ఆలోచించింది. అందకే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎందరో సీనియర్ నేతలను కాదని.. వాళ్లను పట్టించుకోకుండా వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది. కానీ.. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ కు వచ్చిన ఫైదా అయితే ఏం లేదు అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు సమస్య మొదలైంది. మునుగోడు ఉపఎన్నిక ఆయనకు జీవన్మరణ సమస్యగా మారింది. ఎందుకంటే.. రేవంత్ రెడ్డి భవితవ్యం మొత్తం మునుగోడు ఉపఎన్నిక మీదనే ఆధారపడి ఉంది.. అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈసారి కూడా మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోతే.. అధిష్ఠానం నుంచి ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.  సిట్టింగ్ స్థానం మునుగోడును నిలబెట్టుకోకపోతే ఇక అంతే నిజానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత బీజేపీలో చేరాడు. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక జరగబోయే రెండో ఉపఎన్నిక ఇది. ఇప్పటికే హుజూరాబాద్ లో ఉపఎన్నిక జరగగా.. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. ఈటల రాజేందర్ వేవ్ నడవడంతో అక్కడ టీఆర్ఎస్ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది. కానీ.. ఈ నియోజకవర్గం అలా కాదు. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం.. అలాగే మునుగోడు కాంగ్రెస్ కంచుకోట. కాబట్టి ఎలాగైనా మునుగోడు ఉపఎన్నికను గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటాలని.. మునుగోడు ఉపఎన్నిక గెలుపే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాంది కావాలని కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి.. మునుగోడులో ఏం జరగబోతోందో?