TELANGANA

KTR Criticised: సీఎం రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు.. యువజన కాంగ్రెస్ నేత శ్రీకర్ గౌడ్

ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, విద్యావ్యవస్థ బలోపేతంపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్ విమర్శించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ రాజకీయ స్వార్థంతో తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీకర్ గౌడ్ ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సరైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో పాటు పేపర్ లీకేజీల కారణంగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆయన విమర్శించారు. గత పాలనలో జరిగిన పరిణామాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తోందని శ్రీకర్ గౌడ్ తెలిపారు. ఈ చర్యలను ఓర్వలేక కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.