విభిన్న భాషల్లో కొత్త తరహా పాత్రలు చేసే అవకాశాలు రావడం తన కెరీర్లో అద్భుతమైన దశగా భావిస్తున్నానని జగపతి బాబు తెలిపారు. తాను మెథడ్ యాక్టర్‌ను కాదని, పాత్ర కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేయనని చెప్పారు. షూటింగ్ సమయంలో సీన్ ఎనర్జీని, దర్శకుడి విజన్‌ను అనుసరించి నటిస్తానని, షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ పాత్రను అక్కడే వదిలేసి సాధారణ భర్తగా, తండ్రిగా కుటుంబంతో గడుపుతానని వెల్లడించారు. వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన గీత ఉంటుందని వివరించారు.
బిజీ షూటింగ్ షెడ్యూల్స్ నుంచి విరామం దొరికినప్పుడు తనకు తాను సమయం కేటాయించుకుంటానని జగపతి బాబు చెప్పారు. ఉదయాన్నే యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, పెంపుడు జంతువులతో గడపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఫిట్నెస్, ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటిస్తానని, వ్యక్తిగత ప్రశాంతతకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

