డిసెంబర్ 7 నుంచి నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఫార్చ్యూన్ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమ్మిట్‌కు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా ప్రతినిధులకు ప్రవేశం కల్పించాలని సూచించారు. విధుల్లో ఉండే అధికారులు ప్రతినిధులతో మర్యాదగా వ్యవహరించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
ప్రతినిధుల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు మెరుగైన ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సీఎం సూచించారు. అలాగే ప్రతి ప్రతినిధికి అవసరమైన సహకారం అందించేందుకు లైజనింగ్ ఆఫీసర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమ్మిట్ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

