AP

ఏపీని అంతర్జాతీయ సముద్ర వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, పరిశ్రమలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మారిటైం రంగంలో ఆగ్నేయాసియా (ఆసియాన్) దేశాలతో బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రం భావిస్తోందన్నారు. సముద్ర అనుసంధానం, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారానికి ఏపీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన లోకేష్.. భారత్, ఆగ్నేయాసియా దేశాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సముద్ర వాణిజ్య సంబంధాలను ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సముద్ర ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 వంటి కార్యక్రమాల ద్వారా పోర్టులు, నౌకా నిర్మాణం, సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సముద్ర రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం సుమారు రూ.70 వేల కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపిందని, ఇందులో రూ.25 వేల కోట్ల మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ ఉందని తెలిపారు. దేశ వాణిజ్యంలో సుమారు 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోందని, ప్రతి కొత్త పోర్టు పరిశ్రమలు, వ్యాపారాలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.