World

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ప్రధాని మోడీ ఫోన్‌ ట్రేడ్‌ డీల్‌పై కీలక నిర్ణయం

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫోన్‌ చేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్- యూకేల మధ్య స్వేచ్ఛా- వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)ను త్వరలో ముగించాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించినట్లు ట్వీట్‌ చేశారు . ‘ఈ రోజు రిషి సునాక్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. యూకే పీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేశా. ఇరు దేశాల సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య ఎఫ్‌టీఏను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అంగీకరించాం.’ అని ట్విటర్‌ వేదికగా తెలిపారు. మోడీ ఫోన్‌ చేసిన అనంతరం బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోడీని ట్యాగ్‌ చేశారు. ‘నేను కొత్త బాధ్యతలు చేపట్టిన క్రమంలో విలువైన సూచనలు అందించిన ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు. యూకే, భారత్‌ మధ్య చాలా సంబంధాలున్నాయి. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు సాధించే విజయాలను చూడాలని ఆసక్తిగా ఉన్నాను. భద్రత, రక్షణ, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం.’ అని ట్వీట్‌ చేశారు రిషి సునాక్‌. మరోవైపు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లేవెర్లీ శుక్రవారం భారత్‌కు రానున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.*