కెనడాలోని తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్క్ పర్మిట్ ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ నిర్ణయం కెనడాలోని వేలాది భారతీయులకు, ఇతర విదేశీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. Open Work Permit – OWP: ఉద్యోగుల కొరత కరోనా అనంతరం, కెనడాను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కెనడానే కాదు, అమెరికా, యూరోప్ దేశాల్లోనూ నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో తాత్కాలిక ఉపాధి కోసం వర్క్ పర్మిట్ ఉన్న వారి కుటుంబ సభ్యుల్లోని అర్హులకు కూడా వర్క్ పర్మిట్ ఇవ్వనున్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్, సిటిజన్ షిప్, రెఫ్యూజీస్ శాఖ మంత్రి సీన్ ఫ్రేజర్ శనివారం వెల్లడించారు. కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ (Open Work Permit – OWP) ఉన్న విదేశీయుల కుటుంబ సభ్యులకు కూడా వచ్చే సంవత్సరం నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల కేటగిరీలోకి పిల్లలు, జీవిత భాగస్వామి వస్తారని స్పష్టం చేశారు. కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ (Open Work Permit – OWP) ఉన్న విదేశీ ఉద్యోగులు కెనడాలో ఏ ఉద్యోగమైనా, ఏ యజమాని వద్దనైనా చేయడానికి అవకాశం ఉంటుంది. Temporary Employment: 2 లక్షల తాత్కాలిక ఉద్యోగులు కెనడాలో ఓపెన్ వర్క్ పర్మిట్ (Open Work Permit – OWP) తో సుమారు రెండు లక్షల మంది విదేశీ ఉద్యోగులున్నారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తున్నందున, కొంతవరకు లేబర్ షార్టేజ్ తగ్గుతుందని కెనడా ఆశిస్తోంది. ఇప్పటివరకు అత్యంత నైపుణ్యత ఉన్న రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి జీవిత భాగస్వామికి మాత్రమే కెనడాలో ఉద్యోగం చేసే అవకాశం ఉండేది. తాజా నిర్ణయంతో జీవిత భాగస్వామితో పాటు అర్హత కలిగిన నిపుణులైన పిల్లలకు కూడా 2 సంవత్సరాల కాల వ్యవధితో వర్క్ పర్మిట్ లభిస్తుంది.