AP

అమరావతి రైతులకు చుక్కెదురు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు సుప్రీం కోర్టు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ దానిపై మధ్యంతర స్టే విధించింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని, ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేసింది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీ

నికి ప్రతిగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు అయ్యేలా ఆదేశాలను జారీ చేయాలని అమరావతి రైతులు పిటిషన్లు దాఖలు పరిచారు. ఆయా పిటీషన్లన్నింటినీ క్రోడీకరించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వాదోవాదాలను ఆలకించింది. అభివృద్ధి ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ధర్మాసనం తేల్చడం జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఊపిరిపీల్చుకుంది. ఆరు నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమేనా? అని వ్యాఖ్యానించింది. అనంతరం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్యంతర స్టే ఇవ్వడాన్ని పిటీషనర్ల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వ్యతిరేకించారు. ఈ పిటీషన్లపై వాదనలను వచ్చే వారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను ధర్మాసనం స్వీకరించలేదు. జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.