అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ హెడ్ ఆఫీస్‌ను ఎలాన్ మస్క్ పలు గదులను చిన్నచిన్న నిద్ర గదులుగా మార్చేశారట. ఫోర్బ్స్ ఈమేరకు ఒక కథనంలో తెలిపింది. ఈ గదుల్లో పరుపులు, కర్టేన్లు, కాన్ఫరెన్స్ రూమ్ టెలిప్రెజెన్స్ మానిటర్లు ఈ గదుల్లో ఉన్నాయట. ఆరేంజ్ రంగులో కార్పెట్, పక్కనే ఒక చెక్క టేబుల్, ఒక క్వీన్ బెడ్, టేబుల్ ల్యాంప్, రెండు ఆఫీస్ ఆర్మ్ చైర్లు కూడా ఉన్నాయని ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఈ మార్పులకు కారణాలను ఉద్యోగులకు తెలియపరచలేదు. అయితే ఇవి ఓవర్ టైమ్ వర్క్ చేసి ఓవర్ నైట్ స్టే చేసే ఉద్యోగుల కోసం సిద్ధం చేసినట్టుగా భావిస్తున్నారు. ‘ఇది మంచి సంకేతం కాదు.
మరొక అమర్యాదకర సంకేతం. దీనిపై ఎలాంటి చర్చ లేదు.. ఫ్లోర్‌కు నాలుగు నుంచి 8 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి..’ అని ఫోర్బ్స్ తెలిపింది. గత నెలలో ఎలాన్ మస్క్ ట్విటర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీచేశారు. ఎక్కువ గంటలు పనిచేయాలని, కష్టించి పనిచేయాలని లేదా సంస్థను వదిలివెళ్లాలని ఆదేశించారు. అప్పటి నుంచి ట్విటర్‌లో దాదాపు సగానికి సంగం ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. ఇంకొందరు ఇలాంటి వర్క్ కల్చర్ చూసి స్వచ్ఛందంగా వైదొలిగారని ఫోర్బ్స్ కథనం తెలిపింది. కాగా ఎలాన్ మస్క్ తనకు ఏదో హాని జరిగే ప్రమాదం ఉందని, తనను కాల్చేయడం అందులో ప్రధానమైనదని అన్నారు. ‘నిజం చెప్పాలంటే నాకు చెడు జరిగే ప్రమాదం ఉంది. కాల్చేయవచ్చు కూడా. ఇదే ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంది. కోరుకుంటే ఒకరిని చంపడం పెద్ద కష్టం కాదు. వారు అలా చేయరని ఆశిస్తున్నాం. నేను ఎదుర్కొంటున్న పరిస్థితి చూసి విధి నవ్వుతోంది. అంతేగానీ అలా జరగదు. అయితే కొంత ప్రమాదం అయితే ఉంది..’ అని మస్క్ అన్నారు.