World

కాన్పూర్‌లో 5 బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నకిలీ పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ కుటుంబానికి చెందిన ఐదుగురుని కాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులలో ఒక జంట, వారి పిల్లలు, మహిళ తండ్రి ఉన్నారు. నకిలీ భారతీయ పాస్‌పోర్ట్‌లు, బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు కలిగి ఉండటం.. కాన్పూర్‌లో అక్రమంగా ఉంటున్నందున వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 13 నకిలీ పాస్‌పోర్టులు, ఐదు ఆధార్ కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, రూ.14 లక్షలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న వారిని రిజ్వాన్ మహ్మద్ (53), అతని తండ్రి ఖలీద్ మజీద్ (79), అతని భార్య హీనా ఖలీద్.. వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని ఖుల్నాలో నివాసముంటున్న రిజ్వాన్, అతని కుటుంబ సభ్యులకు జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకీ, స్థానిక కార్పొరేటర్ మానీ రెహమాన్ సర్టిఫికెట్లు జారీ చేశారు. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఆనంద్ ప్రకాష్ తివారీ మాట్లాడుతూ.. సోలంకి, రెహమాన్‌ల సంతకాలను కుటుంబానికి జారీ చేసిన సర్టిఫికేట్‌లపై ఉన్న వాటితో సరిపోల్చడం ద్వారా వారు మోసానికి పాల్పడ్డారో లేదో చూస్తారని తెలిపారు. తొలుత రిజ్వాన్ తమను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని, ఆ తర్వాత విచారణలో నేరం ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. తాను 1996లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చానని, 1998లో ఢిల్లీలో హీనా ఖలీద్‌తో వివాహం జరిపించానని రిజ్వాన్ పోలీసులకు తెలిపాడు. హీనా కూడా అతిక్రమించి బంగ్లాదేశ్‌కు వెళ్లిందని, భారత్‌కు తిరిగి రావడానికి ముందు బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ పొందిందని ఆయన తెలిపారు. వారి పిల్లలు రుక్సర్ రిజ్వాన్ (21), అతని 17 ఏళ్ల కుమారుడు కూడా అక్రమంగా బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడ పాస్‌పోర్ట్‌లు పొందారు. వారిపై IPC, 14-ఫారినర్స్ యాక్ట్ ఆఫ్ 1946 కింద కేసు నమోదు చేశారు.