AP

జగన్మోహన్ రెడ్డి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లెం వేశారు. సక్రమంగా సమావేశాలను(Meetings) నిర్వహించుకోవడానికి అనువుగా లేకుండా పరిస్థితులను మార్చేశారు. దీంతో ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో రహస్యంగా ఉంచుతున్నారు. పీఏసీ(PAC) చైర్మన్ గా టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ సర్కార్ లోని అతి పెద్ద తప్పును బయటకు తీశారు. సుమారు రూ. 25వేల కోట్ల విలువైన సమాచారం గల్లంతైన అంశాన్ని బయట పెట్టారు. ఆ రూ. 25వేల కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేకపోతోంది.

పీడీ అకౌంట్ల నుంచి అనధికారికంగా వేల కోట్లను కొల్లగొట్టిన అంశాన్ని పయ్యావుల కేశవ్ బయటకు తీశారు. ఫలితంగా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం అభాసుపాలయింది. కేంద్రం ఆర్థికశాఖ, ఆర్బీఐ వద్ద తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో మరోసారి అక్రమాలు బయట పడకుండా పీఏసీ (Meetings)భేటీలు లేకుండా చేయగలడం జగన్ సర్కార్ కే చెల్లిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏ ప్రభుత్వంలోనైనా పీఏసీ(PAC) చైర్మన్ పదవి చాలా కీలకమైనది. ఆ పదవి ప్రతిపక్షానికి దక్కుతుంది. కేబినెట్ హోదాతో పాటు మంత్రులకు ఉండే ప్రోటోకాల్ ఉంటుంది. ప్రభుత్వ పరిపాలనలోని ప్రతి అంశంపైన ఆరా తీయడానికి సర్వ హక్కులు పీఏసీ చైర్మన్ కు ఉంటాయి.

ప్రాజెక్టుల్లో అవినీతి, భూకేటాయింపులు, ఉద్యోగ నియామకాలు, కేటాయింపు తదితర అన్ని అంశాలపైన ప్రశ్నించే హక్కు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ మాదిరిగా ప్రభుత్వంలోని ప్రతి అంశంపైనా నిఘా పెడుతుంది. అలాంటి పవర్స్ ఉన్న కమిటీని వ్యూహాత్మకంగా వైసీపీ సర్కార్ నామమాత్రం చేసిందని చెబుతోన్న పయ్యావుల కేశవ్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జరిగిన అక్రమాలను బయట పెట్టారు. ఖరారు చేసిన టెండర్లను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దు చేశారు. వాటి స్థానంలో రివర్స్ టెండర్లను ప్రవేశపెట్టారు. ప్రభుత్వానికి డబ్బు మిగులుతుందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే, రివర్స్ టెండర్ల ద్వారా కాంట్రాక్టులను సొంత వాళ్లకు కేటాయించుకున్నారని సర్వత్రా వినిపిస్తోన్న ఆరోపణ.

ఇప్పుడు అదే అంశాన్ని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేవనెత్తుతున్నారు. విద్యుత్ టెండర్ల విషయంలో జరిగిన అక్రమాల గురించి గళమెత్తారు. సోలార్ విద్యుత్ పై పెద్దఎత్తున దుష్ప్రచారంచేసి, తిరిగి టెండర్లు పిలిచిన జగన్ సర్కారు అదానీ సంస్థకు కట్టబెట్టాలనిచూసింది. దీంతో దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలున్న టాటా సంస్థ జగన్ సర్కారు నిర్ణయంపై కోర్టును ఆశ్రయించింది. అదానీ గ్రూపునకు ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టడం తప్పని తేల్చుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం రద్దుచేసింది. పవన విద్యుత్ కి సంబంధించి చంద్రబాబుగారి హయాంలో `పంప్ డ్ స్టోరేజ్` విధానానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. ఆ విధానం తప్పని భావిస్తూ రద్దు చేశారు. ఇప్పుడు నాడు చంద్రబాబు తీసుకున్న పంప్ డ్ స్టోరేజ్ విధానం సరైనదని భావిస్తూ అరబిందో, గ్రీన్ కో లాంటి సొంత సంస్థలకు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారని పయ్యావుల చేస్తోన్న ప్రధాన ఆరోపణ. ఆ కంపెనీలకు ప్రజా ఆస్తుల్ని కట్టబెట్టే ప్రయత్నంచేస్తున్నాడని నిలదీశారు.

ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబుగారికి క్షమాపణ చెప్పేంత పెద్దమనసు ఆయనకు ఎలాగూలేదు కాబట్టి, ప్రజలకు చెప్పమంటున్నామని పయ్యావుల చురకలు వేయడం గమనార్హం. విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ, పీఏసీ ఛైర్మన్ గా గతంలో విద్యుత్ శాఖ కార్యదర్శికి 11 లేఖలను పయ్యావుల రాశారు. వాటికి ఇప్పటి వరకు సమాధానమే లేదని ఆయన చెబుతున్నారు. వ్యక్తిగత సంబంధాలతోనే సమాచారం సేకరించి, ప్రజలముందు ఉంచే ప్రయత్నాన్ని ఆపనంటూ జగన్మోహన్ రెడ్డి స ర్కార్ ను హెచ్చరించారు. పీఏసీ యాక్టివ్ గా ఉంటే ప్రజలకు ఎంతమేలు జరుగుతుందో, ప్రభుత్వానికి కూడా అంతే మేలు జరుగుతుంది” అని పయ్యావుల వివరించారు. ఇప్పటికైనా పీఏసీ భేటీలను నిర్వహిస్తూ ప్రభుత్వంలోని లోపాలను సరిచేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ, పీఏసీ చైర్మన్ గా పయ్యావుల తొలి రోజుల్లోనే రూ. 25వేల కోట్ల గల్లంతును రాద్ధాంతం చేయడాన్ని ఏపీ సర్కార్ మరువలేక పోతుంది. ఫలితంగా అలంకార ప్రాయంగా పీఏసీ చైర్మన్ పదవితో పాటు కమిటీ కూడా ఉందని సర్వత్రా వినిపిస్తోంది.