National

BRS భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు

భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు పడింది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ఆవిర్భవించింది. దేశ రాజధానికి చేరిన తెలంగాణ అస్తిత్వ రాజకీయం నుంచి, భవిష్యత్తు జాతీయ పాలనకు ముందడుగు పడింది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్డు నెంబర్ 5 లో బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణి దంపతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

యాగంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, , తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ కిసాన్ నేత గుర్నామ్ సింగ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం 12 గంటల 37 నిమిషాలకు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం అతిథులు, పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ జాతీయ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆనంతరం మొదటి అంతస్తులోని తనకు కేటాయించిన ఛాంబర్లో జాతీయ అధ్యక్షుని హోదా లో కుర్చీలో ఆసీనులైనారు. బి ఆర్ ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా, హర్యానా కురుక్షేత్ర కు చెందిన జాతీయ రైతు సంఘం నేత, గుర్నామ్ సింఘ్ చడూని ” ని అదినేత కేసిఆర్ నియమించారు. కార్యాలయ కార్యదర్శి గా రవి కొహార్ ను నియామించారు.

జాతీయ అధ్యక్షుని హోదాలో తొలి నియామక పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపి నామా నాగేశ్వర్ రావు తన నివాసంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజనానికి సీఎం కేసీఆర్ తో పాటు ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నూతన జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ రోడ్డు జై కేసీఆర్, జై భారత్, జై బిఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబిమయమైంది. పలు రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు, పలు పార్టీలకు చెందిన నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొన్నది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం తెలంగాణ భవన్, సీఎం అధికారిక నివాసం 23 తుగ్లక్ రోడ్ లోనూ బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల కేరింతలు, నినాదాలతో సందడి వాతావరణం నెలకొన్నది