National

రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట గ్యాస్‍ సిలిండర్‌ను రూ.500లకే అందించనున్నట్టు వెల్లడించింది. ఉజ్వల పథకం కింద నమోదు చేసుకున్న పేదలందరికీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.500కే ఎల్‍పీజీ సిలిండర్ ఇవ్వనుంది కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) సర్కార్. ఏడాదికి 12 సిలిండర్లు LPG Cylinder for ₹500 in Rajasthan: దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు వచ్చే ఏడాది (2023) ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్‌ను ఇవ్వనున్నట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. ఈ ధరతో ఒక్కో కుటుంబానికి ఏడాదిలో 12 సిలిండర్లను ఇస్తామని చెప్పారు. వచ్చే సంవత్సరంలోనే రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గహ్లోత్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్‍లోని అల్వార్‌లో ఆదివారం జరిగిన ఓ సభలో సీఎం అశోక్ గహ్లోత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆయన సమక్షంలోనే సిలిండర్ ధరపై ప్రకటన చేశారు సీఎం. కేంద్రంపై విమర్శలు రూ.500కే సిలిండర్‌ను ఇస్తామని ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీపై విమర్శలు చేశారు రాజస్థాన్ సీఎం గహ్లోత్. “నేను వచ్చే నెల బడ్జెట్‍కు సిద్దమవుతున్నాను. ప్రస్తుతం, నేను ఒక్కటి చెప్పాలని అనుకుంటున్నా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పేదలకు ఎల్‍పీజీ కనెక్షన్లు, గ్యాస్ స్టవ్‍‍లు ఇస్తున్నారు. కానీ సిలిండర్లు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకంటే ధరలు రూ.400 నుంచి ఏకంగా రూ.1,040కు పెరిగాయి” అని సీఎం అశోక్ అహ్లోత్ అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు Rajasthan Assembly Elections 2023: వచ్చే సంవత్సరం (2023) చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్, డిసెంబర్ మధ్య ఎన్నికలు ఉంటాయి. ఎలాగైనా రాష్ట్రంలో అధికారం నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని వాదనలు ఉన్నాయి. ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరగా.. హైకమాండ్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ వరాన్ని సీఎం గహ్లోత్ ప్రకటించారు. మరోవైపు బీజేపీ కూడా రాజస్థాన్‍పై కన్నేసింది. ఆ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది.