Technology

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్‌ గ్రూపులకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు సీబీఐ విచారణ జరపగా.. వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది. వీడియోకాన్‌ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ వ్యాంక్‌ సీఈవోగా 2018లో చందా కొచ్చర్‌ వైదొలిగారు. 2012లో బ్యాంకు సీఈవో హోదాలో 3,250 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయడం ద్వారా ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్తను అరెస్ట్ చేసింది. గతంలో ఈడీ అరెస్ట్ చేసినప్పుటి కేసులో బెయిల్ మంజూరవగా విచారణ కొనసాగుతోంది. ఆరోపణల నేపథ్యం చూస్తే గతంలో తన భర్త దీపక్‌ కొచర్‌కి చెందిన న్యూపవర్‌ సంస్థకు లబ్ధి

చేకూర్చేలా.. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల మంజూరు విషయంలో చందా కొచర్‌ వ్యవహరించినట్లు ఆరోపణలొచ్చాయి. రుణం లభించినందుకు ప్రతిగా వీడియోకాన్‌ గ్రూప్‌ అధిపతి వేణుగోపాల్‌ ధూత్‌.. న్యూపవర్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. వీడియోకాన్‌ తీసుకున్న ఈ రుణాలు మొండిబాకీలుగా మారాయి. మరోవైపు, ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిశాంత్‌ కనోడియాకి చెందిన ఫస్ట్‌ల్యాండ్‌ హోల్డింగ్స్‌ నుంచి కూడా 2010లో న్యూపవర్‌లోకి రూ. 325 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అదే ఏడాది ఎస్సార్‌ స్టీల్‌ మినెసోటాకి ఐసీఐసీఐ బ్యాంకు సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం 530 మిలియన్‌ డాలర్ల రుణమిచ్చింది. ఇది కూడా మొండిబాకీగా మారడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. కాగా ఫస్ట్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ కార్యకలాపాలపై 2016లో ఆర్‌బీఐ విచారణ కూడా జరిపింది. ఈ కేసు కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో కీలక పదవులను కోల్పోవడమే కాకుండా.. బ్యాంకింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగిన చందా కొచ్చర్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అటు దర్యాప్తులో భాగంగా చందా కొచ్చర్ ఇల్లు, ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. 2019 జనవరిలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌తో పాటు మరికొందరిపై మనీ లాండరింగ్‌ కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.